views
గాజా అమ్మకానికి లేదు: హమాస్
గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతవారం ప్రతిపాదించారు. స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి, దానిని ‘రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్’గా మార్చాలనుకుంటు న్నట్లు కూడా ఆయన అన్నారు. పాలస్తీనియన్లను శాశ్వతంగా ఈజిప్ట్, జోర్డాన్‌లకు ‘తరలించాలి’ అని ఆయన గతంలో సూచించారు. తాజాగా ఈ ప్రతిపాదనలు చేశారు.ఆ వెంటనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సహా ప్రపంచ దేశాల నాయకులు ట్రంప్ ప్రతిపాదనలను ఖండించారు. మరోవైపు గాజా అమ్మకానికి లేదంటూ ఆ ప్రాంతానికి చెందిన నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసలు గాజా ప్రాంతం ఎవరిది, దాని చరిత్ర ఏంటి?
గాజా ఎవరి అధీనంలో ఉంది?
వాస్తవానికి, 2007 నుంచి గాజాలో హమాస్ పాలన ఉంది. అంతకుముందు సంవత్సరమే, ఆక్రమిత ప్రాంతాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ గెలిచింది. తన ప్రత్యర్థి ఫతాను ఈ భూభాగం నుంచి బహిష్కరించిన తర్వాత, గాజాలో తన అధికారాన్ని బలోపేతం చేసుకుంది హమాస్. ఇజ్రాయెల్, అమెరికా సహా కొన్ని పాశ్చాత్య దేశాలు టెర్రరిస్ట్ సంస్థగా పిలుస్తున్న ఈ సంస్థ నియంత్రణలోనే గాజా స్ట్రిప్ ఉంది.
![గాజా అమ్మకానికి లేదు: హమాస్](https://vaartha.com/wp-content/uploads/2025/02/hams-gaza-1024x683.jpg.webp)
ఇజ్రాయెల్, ఈజిప్ట్, మరోవైపు మధ్యధరా సముద్రం హద్దులుగా ఉండే 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పైన భూభాగం ఇది.
హమాస్ – ఇజ్రాయెల్ ఘర్షణలు
ఆ తర్వాతి కాలంలో హమాస్ – ఇజ్రాయెల్ మధ్య ఎన్నోసార్లు ఘర్షణలు జరిగాయి. ప్రతిసారీ ఇరువైపులా ఎంతోమంది చనిపోయారు. వారిలో గాజాకి చెందిన పాలస్తీనియన్లే ఎక్కువ. 2023 అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు గాజా వైపు నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేశారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 1200 మందిని చంపేసి, 250కి పైగా మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఫలితంగా, గాజాలో ఇజ్రాయెల్ భారీ సైనిక దాడి చేసింది. ఈ సైనిక దాడి 15 నెలల పాటు కొనసాగింది. హమాస్ ఆరోగ్య మంత్రిత్య శాఖ లెక్కల ప్రకారం, 47,540 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు.
కాల్పుల విరమణ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాజా యుద్ధాన్ని నిలువరించేందుకు, ఎన్నో ప్రయాసలకోర్చి నెలల తరబడి జరిగిన పరోక్ష చర్చల తర్వాత, 2025 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుపక్షాలూ అంగీకరించాయి. యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు ఇజ్రాయెల్ వద్ద ఉన్న పాలస్తీనియన్ ఖైదీల విడుదల, దానికి బదులుగా హమాస్ వద్దనున్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.
![గాజా అమ్మకానికి లేదు: హమాస్](https://timessquarereporter.com/public/index.php/upload/media/posts/2025-02/12/gaajaa-ammkaaniki-leedu-hmaas_1739337841-b.jpg)
![disclaimer](https://www.timessquarereporter.com/disclaimer-timessquarereporter.jpg)
Comments
0 comment